సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబీఐ విచారణ జరపాలి: అంబటి రాంబాబు

  • సాయికృష్ణ ఇంటికి జగన్ వెళ్లేంత వరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న అంబటి
  • జగన్ వెళితే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా అని ప్రశ్న
  • మరణాల వెనుక సీఐతో పాటు ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం, అలాగే క్రాంతికుమార్ అనుమానాస్పద మృతి కేసులపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో సాగుతున్న పోలీసుల దుర్మార్గాలపై తమ పోరాటం ఆగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సాయికృష్ణ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళ్లి పరామర్శించే వరకు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.


"గత నెల 28వ తేదీనే అడ్వకేట్ కనకదుర్గ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. అయినా సరే బాధ్యులైన పోలీసులపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? జగన్ ఆ కుటుంబానికి అండగా నిలబడేందుకు వెళ్తే తప్ప సీఐ మీద కేసు నమోదు చేయరా? అంటే రాష్ట్రంలో లాకప్ డెత్ జరిగిందని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్లే కదా" అని ప్రశ్నించారు. 


సాయికృష్ణ పిన్ని కనకదుర్గ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన తర్వాతే అసలు కథ ప్రారంభమైందని, కేవలం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని మండిపడ్డారు. పేరిపోగు క్రాంతికుమార్ కూడా సదరు సీఐ పెట్టిన థర్డ్ డిగ్రీ టార్చర్ భరించలేకే ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ రెండు మరణాల వెనుక సీఐతో పాటు ఇంకా చాలా మంది ఉన్నతాధికారుల హస్తం ఉందని, వారందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు.


సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన ఫొటోలు, కాళ్లపై ఉన్న గాయాల దృశ్యాలు ఫేక్ అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న ప్రచారాన్ని అంబటి రాంబాబు తీవ్రంగా తప్పుపట్టారు. "అవి ఫేక్ ఫొటోలు అయితే సాయికృష్ణను బతికుండగా చూపించండి. ఒకవేళ నేను చూపించిన ఆధారాలు తప్పు అయితే నాపై లీగల్‌గా కేసు పెట్టుకోండి. చనిపోయిన సాయికృష్ణ కుటుంబం తాము జనసేన పార్టీ వారమని స్వయంగా చెబుతున్నా.. కూటమి నాయకులు ఆ ఇంటికెళ్లి పరామర్శించకపోగా, కేసును రాజీ చేయాలని చూడటం సిగ్గుచేటు. కనీసం ఆ తల్లి అడుగుతున్న సాయికృష్ణ అస్థికలను కూడా ఇవ్వకుండా మాయం చేశారు. జనసేన నాయకులుగా ఉండి సొంత క్యాడర్‌కు న్యాయం చేయలేనప్పుడు ఏం ప్రయోజనం?" అంటూ దుయ్యబట్టారు.


విపక్షంగా బాధితులకు న్యాయం చేయాలని తాము చూస్తుంటే కూటమి ప్రభుత్వం తమపై బురద జల్లడం దుర్మార్గమన్నారు. సాయికృష్ణ కేసులో తెరవెనుక ఉన్న పాత్రధారులంతా బయటకు రావాలని, అలాగే దళిత యువకుడు క్రాంతికుమార్ కుటుంబానికి కూడా ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార బలంతో సాయికృష్ణ కుటుంబాన్ని మాయ చేసి ఉండొచ్చు కానీ... నిర్వీర్యమైన పోలీస్ వ్యవస్థ పనితీరుపై, ప్రభుత్వ అరాచక పోకడలపై వైసీపీ చట్టపరమైన, రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తుందని అంబటి రాంబాబు హెచ్చరించారు.


Ambati Rambabu
Sai Krishna lockup death
Vijayawada police case
CBI investigation demand
YSRCP vs TDP Janasena
Kranthi Kumar death case

More Telugu News